ఉదాత్త సాహిత్యంతో సృష్టించబడిన సినీ గీతాలంటే ఎంతో అభిమానం, ఇంకా ఇంగ్లీష్‌లో చెప్పాలంటే “PASSION” ఉన్న ప్రముఖ గాయని శ్రీమతి శారద ఆకునూరి.

శ్రీ మృతుంజయరావు, శ్రీమతి రమాదేవి దంపతులకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన శారద ఆకునూరి, గుంటూరు జిల్లా బాపట్లలో మరియు చిత్తూరు జిల్లా తిరుపతిలో విద్యాభ్యాసం చేశారు.

మూడేళ్ల లేత వయస్సులోనే పాటలు పాడటం అభ్యసించిన ఆమె, భక్తి, లలిత, సినిమా పాటల పోటీలలో అనేక రాష్ట్రస్థాయి బహుమతులు గెలుచుకున్నారు. వ్యాసరచన మరియు నృత్య పోటీలలో పాల్గొని పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోని యువవాణి కార్యక్రమంలో లలిత గీతాలు ఆలపించి, అతి కొద్ది కాలంలోనే రేడియో ఆడిషన్‌లో కృతార్థురాలై రేడియో గాయనిగా అనేక లలిత గీతాలు ఆలపించారు. స్నేహం, అక్షరాస్యత వంటి అంశాలపై యువవాణి రేడియో నాటికలలో ప్రధాన పాత్రలు పోషించారు.

తన గాత్రంతో ఆకాశవాణి శ్రోతలతో పాటు టీవీ ప్రేక్షకులను కూడా అలరించారు. ఈటీవీ వారి సరిగమలు, జెమినీ టీవీ వారి నవరాగం కార్యక్రమాలలో పాల్గొన్నారు. హైదరాబాద్ దూరదర్శన్‌లో టెలీ స్కూల్ కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలతో పాటు పలువురు సినీ ప్రముఖులు, జగపతిబాబు, కె.ఎం. రాధాకృష్ణన్, రాజా, కోటి వంటి సంగీత దర్శకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఇంటర్వ్యూ చేసి, తన ప్రశ్నావళితో వారి అంతరంగాలను ఆవిష్కరించారు. సిటీ కేబుల్ న్యూస్ రీడర్‌గా, గేమ్ షో హోస్ట్‌గా, యాంకర్‌గా ప్రేక్షకాభిమానాన్ని పొందారు.

అమెరికాలో చదువుకుని స్థిరపడిన శ్రీమాన్ నివాస్ ఆకునూరిని వివాహం చేసుకుని, అక్కడ కూడా తెలుగు భాషా–సంస్కృతులను పరిరక్షించాలి, పెంపొందించాలి అనే సదుద్దేశంతో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితిలో సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేసి, తదుపరి రెండు సంవత్సరాలు అధ్యక్షురాలిగా సేవలందించారు.
ఆ సమయంలో ఉగాది, సంక్రాంతి, వాగ్గేయకారోత్సవం, సిద్ధేంద్రయోగి జయంతి ఉత్సవం, వనభోజనాలు, ఇమ్మిగ్రేషన్ సెమినార్ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు.

ఇదే కాక మీనాక్షి దేవస్థానం వారి Vedic Heritage Schoolలో రామాయణం, భారతం, భాగవతం బోధించే అధ్యాపకురాలిగా పనిచేశారు. హ్యూస్టన్ తెలుగు రేడియోలో రేడియో జాకీగా శ్రోతలకు అలనాటి మధుర గీతాలు, పొడుపుకథలు, ఆటలతో ప్రతి శనివారం అలరించారు. అమెరికా రేడియోలో మొట్టమొదటిసారిగా పాటల పోటీలు నిర్వహించి విశేష ప్రశంసలు పొందారు.

19వ TANA ద్వైవార్షిక సభలకు కల్చరల్ చైర్‌గా, NATA మహాసభల్లో సాంస్కృతిక కార్యదర్శిగా వ్యవహరించారు. TANA చైతన్య ప్రసవానికి సాంస్కృతిక కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో భాషా–సంస్కృతి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన 20వ TANA మహాసభల్లో దంతాన అడ్వైజర్‌గా సంగీత పోటీలు నిర్వహించారు.

అమెరికాలో ఉంటూనే తనకు పాటలపై ఉన్న తపనతో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అమెరికా, కెనడా, భారతదేశంలోని అనేక నగరాల్లో వందలాది సంగీత విభావరిలో పాల్గొన్నారు.
పీ. సుశీల, కోకా జమునారాణి, రమణకృష్ణ తన్నీరు, ఘంటసాల రత్నకుమార్, తలకాయారుపున్, శ్రీమాన్ కృష్ణ, హేమచంద్ర వంటి ప్రముఖ నేపథ్య గాయకులతో కలిసి సంగీత కార్యక్రమాలు నిర్వహించి సంగీత ప్రియుల ప్రశంసలు అందుకున్నారు.

అమెరికాలో బహుళ ప్రజాదరణ పొందిన తెలుగు టైమ్స్ పత్రిక 9వ వార్షికోత్సవ సందర్భంగా, అమెరికాలోని 9 మంది ప్రముఖుల జాబితాలో ఆమెకు స్థానం లభించింది. డల్లాస్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సంబరాలలో “Commitment and Contribution to the Empowerment of Women” అవార్డును పి. సుశీల గారితో కలిసి స్వీకరించారు. అక్కినేని గారి 89వ పుట్టినరోజు సందర్భంగా TANA కమ్యూనిటీ సర్వీస్ అవార్డును శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అందుకున్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ANR గారి 90వ పుట్టినరోజు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి పెండ్యాల పురస్కారం, జమున గారికి ఆదరణ పురస్కారం, కోట శ్రీనివాసరావు గారికి అలూరి సీతారామరాజు పురస్కారం, అలీకి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వంటి అనేక ప్రతిష్టాత్మక వేడుకల్లో ప్రధాన గాయనిగా పాల్గొన్నారు.
2014లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ, కోటి గార్లతో కలిసి వంశీ ఉగాది పురస్కారం అందుకున్నారు.

సంగీతంతో పాటు సాహిత్యంపై కూడా ఆసక్తి కలిగిన శారద ఆకునూరి గారు పలువురు రచయితల పుస్తకాల ప్రచురణకు సహాయ సహకారాలు అందించారు. డా. సి. నారాయణరెడ్డి గారి “క్షేత్ర బంధం”, దాశరథి గారి పుస్తకాలు, “నేలమీద జాబిలి – నింగిలోని సిరితల్లి” వంటి గ్రంథాలను ప్రచురించి, వాటి ఆదాయాన్ని వృద్ధ కళాకారులు, వికలాంగులకు అంకితం చేశారు.

వికలాంగుల సహాయార్థం అమెరికాలో 25 నగరాల్లో నిర్వహించిన ఘంటసాల ఆరాధనోత్సవాలు, బాలు సంగీతోత్సవాలలో ప్రధాన గాయనిగా పాల్గొని కార్యక్రమాల విజయానికి తోడ్పడ్డందుకు “గాన రత్న” పురస్కారం అందుకున్నారు.

విశ్వవిఖ్యాత మీడియా సంస్థలు ఆమెను “అమెరికా గాన కోకిల”, “గాంధర్వ రసవర్ణిని” వంటి బిరుదులతో సత్కరించాయి.

ప్రస్తుతం అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షురాలిగా వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నారు.

Scroll to Top